షార్‌లో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు?

Why are CISF men committing suicides at Satish Dhawan Space Centre. తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆత్మహత్యల పర్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2023 9:48 AM IST
షార్‌లో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు?

శ్రీహరికోట : తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆత్మహత్యల పర్వం కలకలం రేపింది. ఇద్దరు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందితో సహా ముగ్గురు వ్యక్తులు ఒకే వారంలో తమ జీవితాలను ముగించారు. PCMC రాడార్ సెంటర్‌లో (CISF) జవాన్ మరణించిన వారం తర్వాత, CISF సబ్-ఇన్‌స్పెక్టర్ వికాస్ సింగ్, అతని భార్య ప్రియా సింగ్ కూడా షార్‌లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు.

జనవరి 10 న పిసిఎంసి రాడార్ సెంటర్-1 ఏరియాలో డ్యూటీలో ఉండగా 29 ఏళ్ల చింతామణి అనే సిఐఎస్‌ఎఫ్ జవాన్ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అతను నెల రోజుల సెలవు తర్వాత జనవరి 10న తిరిగి విధుల్లో చేరాడు. కుటుంబ సమస్యల కారణంగానే అతడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

జనవరి 16న CISF సబ్-ఇన్‌స్పెక్టర్ అయిన 30 ఏళ్ల వికాస్ సింగ్ షార్ గేట్ 1 వద్ద తన సర్వీస్ వెపన్‌తో తలపై కాల్చుకున్నాడు. 2015 బ్యాచ్ కు చెందిన CISF అధికారి అయిన‌ వికాస్ నవంబర్ 2022లో ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి శ్రీహరికోటకు బదిలీ పై వ‌చ్చాడు.

సంఘటన జరిగిన వెంటనే అతని భార్య ప్రియా సింగ్ అతని సోదరుడు, ముగ్గురు పిల్లలతో కలిసి జనవరి 17 న ఉత్తరప్రదేశ్ నుండి షార్ కు చేరుకున్నారు. పోలీసులు ప్రియా సింగ్, ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

బుధవారం ప్రియా సింగ్ గెస్ట్ హౌస్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించగా, పోస్టుమార్టం అనంతరం వికాస్ సింగ్ మృతదేహాన్ని కూడా అదే ఆస్పత్రిలో ఉంచారు. భర్త మరణాన్ని తట్టుకోలేక ప్రియా సింగ్ తన జీవితాన్ని ముగించుకుని ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

సీనియర్ అధికారుల వేధింపులపై మృతుల కుటుంబ సభ్యులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసు విచారణలో తేలింది. ముగ్గురి ఆత్మహత్యలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Next Story