శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే
Vice President Venkaiah Naidu visits Tirumala.తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
By తోట వంశీ కుమార్
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నాన్నట్లు చెప్పారు. ఇక తిరుమలకు ఎన్ని సార్లు వచ్చినా.. నూతనోత్సాహం కలుగుతుంటుందని తెలిపారు. శ్రీవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోని.. ఆనందం పొందాలన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. ఇక ఆలయంలో భక్తుల కోసం టీటీడీ చేపట్టిన ఏర్పాట్ల బాగున్నాయని కొనియాడారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలని అలా చేయడం వల్ల శ్రీవారి దర్శన భాగ్యం అందరికి లభిస్తున్నారు. ఈ విధానాన్ని తాను పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
కాగా.. నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు వివాహాం జరగనుంది. ఈ వివాహానికి హాజరుకావడానికే తిరుమలకు వచ్చామన్నారు. పుష్పగిరి మఠంలో నిరాడంబరంగా ఈ వివాహం జరగనుంది.