వైభవంగా తిరుమల శ్రీవారి ప్రణయకలహోత్సవం
Vaikunta Ekadashi celebrations in Tirumala Tirupati. కలియుగ దైవం శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి.
By అంజి
కలియుగ దైవం శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు సాయంత్రం శ్రీవారి ప్రణయ కలహోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీవారిని, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీల నుండి వేరు వేరుగా ఉత్సవ మండపం నుండి బయల్దేరారు. ఆ తర్వాత వరాహస్వామి ఆలయం వద్ద కలిశారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశికి ఆరో రోజు కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకను పూర్తిగా కోవిడ్-19 నిబంధనల మధ్య నిర్వహించారు.
ప్రణయకలహోత్సవంలో భాగంగా శ్రీమలయప్పస్వామి వారి పల్లకి ఎక్కి స్వామి పుష్కరిణి దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత అమ్మవారులు కూడా చెరొక పల్లకిపై వచ్చి స్వామి వారికి ఎదురువచ్చి నిలుచున్నారు. ఆ తర్వాత అర్చుకులు.. స్వామి, అమ్మవార్ల తరఫున వేరు వేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతించారు. ఆ తర్వాత నిందాస్తుతి చేసి పూలబంతులు విసురుకోవడం, తానేమి తప్పు చేయలేదని అమ్మవార్ల ముందు స్వామి ప్రాధేయపడటం, ఆ తర్వాత అమ్మవార్లు స్వామి వారికి కర్పూరహారతులు అందుకోవడం వంటి సన్నివేశాలతో ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.