శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
TTD to Release Arjitha Seva online Quota tickets.
By తోట వంశీ కుమార్ Published on 22 Feb 2023 7:50 AM ISTకలియుగ ప్రత్యక్ష్యదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. వచ్చే మూడు నెలల కాలానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను నేడు(గురువారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాకు సంబంధించిన టికెట్లు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.
అదేవిధంగా.. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాలను గమనించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
బుకింగ్ ప్రాసెస్ ఇలా..
టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే వారు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే టికెట్ బుక్ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడి స్లాట్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేస్తే చాలు.