కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే.. స్వామి వారి దర్శన భాగ్యం అంత ఈజీ కాదు. ముందస్తు టోకెన్లు ఉంటేనే స్వామి వారిని క్షణకాలం పాటు అయినా చూడొచ్చు.
స్వామి వారిని దర్శించుకోవాలనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను నేడు(శుక్రవారం) విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి.
అంతేకాకుండా ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు పొందాలని సూచించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే భక్తులు టికెట్లు పొందాలని, నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.