కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులకు శుభవార్త. నేటి(శనివారం) నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తిరిగి ప్రారంభించనుంది. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు అందజేయనున్నారు. వారం రోజుల తరువాత భక్తుల సూచనలను పరిగణలోకి తీసుకుని దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా టోకెన్లను జారీ చేయడం లేదు.
వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బావిస్తోంది. అందుకనే ఈ మూడు నెలల పాటూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300/ దర్శన టికెట్లను తగ్గించనున్నట్లు తెలిపింది. అన్ని కల్యాణకట్టలు 24 గంటలు పని చేస్తాయని, తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను నిర్వహిస్తామని పేర్కొంది.