కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) శుభవార్త చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ. 300 విలువైన ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రోజుకు 25 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లోనే టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. వర్చువల్ క్యూ పద్ధతిలో ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయించనుంది.
ఇక వేసవి సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జులై 15 వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు స్పష్టం చేశారు.