తిరుమల ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై టీటీడీ విచారణకు ఆదేశించింది.
By M.S.R Published on 25 May 2023 12:45 PM GMTTTD, Tirumala Ghat road, bus accident, Tirumala
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై టీటీడీ విచారణకు ఆదేశించింది. బుధవారం ఘాట్ రోడ్డు లో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చైర్మన్,టీటీడీ సీవీ ఎస్వో నరసింహ కిషోర్, రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం చెంగల్ రెడ్డి, ఓలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులతో కలిసి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. బస్సు లో సాంకేతిక ఇబ్బందులు లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారన్నారని ఈవో తెలిపారు.
వేంకటేశ్వర స్వామి దయ వల్ల బస్సులోని ప్రయాణీకులెవరికీ పెద్ద గాయాలు కాలేదని.. తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చడానికి టీటీడీ(TTD) అన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరక్కుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని చైర్మన్ అధికారులకు సూచించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి అతివేగమా.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా అనే కోణంలో దర్యాప్తు జరిపి నివేదికను ఇవ్వాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా పడింది. ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని లోయలో పడింది. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది బస్సు అద్దాలు పగలగొట్టి భక్తులను రక్షించారు. భక్తులందరూ స్వల్పగాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను రుయా ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.