భక్తుల కోసం అప్‌గ్రేడ్ ఫీచర్లతో.. టీటీడీ కొత్త మొబైల్ యాప్ విడుదల
TTD launches new mobile app with upgraded features. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం
By అంజి Published on 27 Jan 2023 10:12 AM GMTతిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు తిరుమల దర్శనం, వసతి టిక్కెట్లు సులభంగా బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రస్తుత గోవింద మొబైల్ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసి మరిన్ని ఫీచర్లను పొందుపరిచి కొత్త యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం యాప్‌లో అందుబాటులో ఉందన్నారు.
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ యాప్ దోహదపడుతుందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. జియో సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించిందని తెలిపారు. కొత్త మొబైల్ యాప్ విశేషాలను వైవీ సుబ్బారెడ్డి వివరిస్తూ తిరుమల ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలను భక్తులు పుష్ నోటిఫికేషన్ల ద్వారా పొందవచ్చని, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎస్వీబీసీ ప్రసారాలను వీక్షించవచ్చని తెలిపారు. అలాగే భక్తులు యాప్ ద్వారా సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు
మరోవైపు భక్తుల అన్ని అవసరాలకు ఈ యాప్ డిజిటల్ గేట్‌వేగా ఉపయోగపడుతుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భక్తులు ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండా లాగిన్ కావాలంటే యూజర్ నేమ్, ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. తక్కువ సంక్లిష్టతతో యాప్‌ను రూపొందించామని, అన్ని వయసుల వారు సులువుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనీష్ షా, ఐటీ అడ్వైజర్ అమర్, ఐటీ జీఎం సందీప్, యాప్ రూపొందించిన బృందం పాల్గొన్నారు.