శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం..!
కొండపై సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 5:11 AM GMTబస్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి
శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల వెళ్లే భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న బస్సులు వచ్చేశాయి. కొండపై సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఈ బస్సులను ప్రారంభించారు. ఒలెక్ట్రా సంస్థకు చెందిన రూ.18 కోట్లు విలువైన ఈ విద్యుత్ బస్సులను హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ టిటిడికి విరాళంగా అందజేసింది.
తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహాల వద్ద ధర్మరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం వాహన కాలుష్యాన్ని తగ్గించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగానే డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెడుతున్నాం. మొదటి దశలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు 35 విద్యుత్ కార్లు ఇచ్చామన్నారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎపిఎస్‌ఆర్‌టిసి తిరుమల-తిరుపతి మధ్య 65 విద్యుత్ బస్సులు నడుపుతోందన్నారు. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ ఒక్కో బస్సును రూ.1.80 కోట్ల ఖర్చుతో తయారు చేయించి 10 బస్సులను టీటీడీకి ఇచ్చిందన్నారు. ఈ బస్సులను ఛార్జింగ్ చేసేందుకు తిరుమలలోని వర్క్‌షాప్ సమీపంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 15 నుండి తిరుమలలో భక్తులకు ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. తిరుమలలో భక్తులను ఉచితంగా గమ్యస్థానాలను ఈ బస్సులు చేరుస్తాయి. కాగా టిటిడి ఛైర్మన్, ఈవో ఇతర అధికారులు కలిసి తిరుమలలో విద్యుత్ ధర్మరథాల్లో ప్రయాణించి ట్రయల్ రన్ నిర్వహించారు.