శ్రీవారి భక్తులకు షాక్.. వసతి గృహాల అద్దెలను పెంచిన టీటీడీ
TTD increased rent of Accommodation rooms in Tirumala.తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం
By తోట వంశీ కుమార్
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) షాకిచ్చింది. సామాన్య, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను భారీగా పెంచింది. ఈ నెల 1 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
ఇటీవల తిరుమలలో ఉన్న అన్ని పాత వసతి కేంద్రాలను ఆధునీకరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు చేయించారు. గీజర్, ఏసీ వంటి సదుపాయాలు కల్పించారు. అదే సమయంలో అద్దెను పెంచేశారు.
తిరుమలలో దాదాపు 6 వేల గదులు ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ఒక్కసారిగా రూ.500 నుంచి రూ.1000 వరకు పెంచేశారు. అలాగే.. నారాయణగిరి రెస్టు హౌజ్ లోని 1,2,3 గదులను జీఎస్టీతో కలిపి రూ.150 నుంచి రూ.1700లకు, నాలుగులో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700లకు, కార్నర్ షూట్ ను జీఎస్టీతో కలిపి రూ.2,200లకు, స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 నుంచి జీఎస్టీతో కలిపి రూ.2,800కి పెంచారు.
ఎంత మొత్తంలో గదిని అద్దెకు తీసుకుంటారో అంతే మొత్తంలో డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఓ గదిని రూ.1700 తీసుకుంటే డిపాజిట్‌తో కలిసి రూ.3,400 చెల్లించాలి. ధరలు పెంచడాన్ని సామాన్య భక్తులు వ్యతిరేకిస్తున్నారు. వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తుల కోణంలో చూసి గదుల ధరల విషయంలో మరోసారి పునరాలోచించాలని కోరుతున్నారు.