మరో సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది
By M.S.R Published on 5 Oct 2024 8:00 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీలో గత ఐదేళ్లుగా అమలవుతోన్న రివర్స్ టెండరింగ్ ను రద్దు చేస్తున్నట్లు శ్యామలరావు తెలిపారు.
తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. సుమారు రూ.13.45కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాలలో ఆధునిక సౌకర్యాలతో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు – గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులో ఆహార తయారీ, ఆవిరి ఆధారిత వంట ఎల్పిజి ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు, అన్నప్రసాదాలు పులిహోర, సాంబర్ రైస్, పొంగల్, ఉప్మా సిద్ధం చేసి సిఆర్ఓ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించవచ్చు. ఈ అన్నప్రసాదాలను సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పిఎసి- I, రామ్ బాగీచా విశ్రాంతి భవనం వద్ద వున్న బస్ స్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేస్తారు.