సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు తెలియజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఛైర్మన్ సమాధానమిస్తూ.. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవనయానమని ఆయన చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని కరుణాకర రెడ్డి అన్నారు.
హైందవ ధర్మవ్యాప్తికి, సనాతన సంప్రదాయాలను కాపాడడానికి, సంస్కృతిని పరిరక్షించడానికి టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు, హైందవ ధర్మానికి నాయకత్వం వహించేలా టీటీడీ పనిచేస్తోందన్నారు. ప్రతి నిర్ణయం ధర్మరక్షణ కోసమే తీసుకోవాలని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వహించాలని కోరారు.