ఆ పది రోజులు ప్రత్యేక దర్శనాలు ఉండవు : టీటీడీ

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు తిరుమలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on  14 Dec 2024 3:45 PM GMT
ఆ పది రోజులు ప్రత్యేక దర్శనాలు ఉండవు : టీటీడీ

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు తిరుమలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నామని, ఈ సమయంలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ అధికారులు, మాజీ చైర్మన్ లకు జనవరి 10 రోజున దర్శనాలకు అనుమతించబోమని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. పసిబిడ్డలు, దివ్యాంగులు, వృద్ధులు, రక్షణ శాఖ, ఎన్నారై తదితర విశేష దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు

•⁠ ⁠దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.

•⁠ ⁠చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.

•⁠ ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.

•⁠ ⁠భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.

•⁠ ⁠గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.

•⁠ ⁠భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.

•⁠ ⁠మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.

•⁠ ⁠3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.

Next Story