తిరుమల బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు.. ఎప్పటినుంచంటే?
TTD Break Darshans Timings will change from december 1st. డిసెంబర్ 1వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు జరగనున్నాయి.
By అంజి
డిసెంబర్ 1వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు జరగనున్నాయి. శ్రీవారి బ్రేక్ దర్శనాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్పించనున్నారు. కొత్త సమయాలకు అనుగుణంగా ఆన్‌లైన్ టికెట్ స్లాట్‌లను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరాలు తెలిపారు. రూ.300 ప్రత్యక ప్రవేశ దర్శనం టిక్కెట్ల స్లాట్‌లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయంలో బంగారు తాపడం పనులపై ఆరు నెలల నుంచి ఆగమ సహాల మండలి పరిశీలిస్తోందని చెప్పారు.
బంగారు తాపడం పనులు ప్రారంభించిన 6 నెలలలోపు శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాలు, దర్శనాలకు సంబంధించి ధర్మకర్తల మండలిలో చర్చించనున్నారు. ఆనంద నిలయంలో బంగారు తాపడం పనులు నిర్వహించేందుకు బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు దాతలు రెడీగా ఉన్నారని ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ ఆపన్న హస్తం స్కీమ్‌కు లక్ష రూపాయలు డిపాజిట్ చేసిన వారికి ఆరు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారని, రూ.10 వేలు విరాళం ఇచ్చే వారికి కూడా దర్శనం కల్పించాలని భక్తులు కోరారని, అయితే అది సాధ్యపడదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు విరాళం ఇచ్చి బ్రేక్ దర్శనాలు కోరే ఛాన్స్ ఉండటంతో విరాళం మొత్తాన్ని తగ్గించలేమన్నారు. అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారిని 22.72లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ కానుకలు రూ.122.23కోట్లు లభించాయని చెప్పారు. గత నెలలో తిరుమలలో దాదాపు 1.08కోట్ల లడ్డూలను విక్రయించారని, 10.25లక్షల మంది తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 20 నుంచి 28వరకు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.