శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి కోటా దర్శనం టికెట్లు విడుదల తేదీలు ఇవే
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 11:58 AM GMTతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల..
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అక్టోబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు..
జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా..
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా..
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అక్టోబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..
జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల..
తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.