జలదిగ్బంధంలో తిరుపతి.. ప్రజలెవరూ బయటికి రావొద్దు
Tirumala witnesses massive flood.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం వాయుగుండంగా మారి తమిళనాడు,
By తోట వంశీ కుమార్ Published on 19 Nov 2021 8:37 AM ISTఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో తన ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండడంతో తిరుపతిలోని దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. తిరుమలలోని తిరుమాడ వీధులు కూడా జలమయం అయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సెల్లార్లలోకి నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కనుమదారుల్లో కొండచరియలు విరిగిపడుతుండడంతో ఆ మార్గాన్ని మూసివేశారు.
ఈదురుగాలులకు వృక్షాలు నేలకొరిగాయి. కాలనీల్లో ప్రవహిస్తున్న వరద ధాటికి కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. రైల్వే అండర్ బ్రిడ్జీల వద్ద భారీగా నీరు చేరింది. దీంతో ఆ మార్గాన్ని మూసేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. చెట్లు కూలిపోవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇంటర్‌నెట్ సేవలు కూడా స్తంభించాయి. కాగా.. తిరుపతిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు సూచించారు. తిరుపతి నుంచి నెల్లూరు, చెన్నై వెళ్లే వారు పూత్తూరు, నాగలాపురం, సత్యవవేడు, తడ మీదుగా వెళ్లాలన్నారు.
ప్రజల సహాయం కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే 0877-2256766 నెంబర్‌ను సంప్రదించాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇక చిత్తూరు జిల్లాలోని కల్యాణి డ్యామ్ వద్ద నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 2015 తర్వాత కల్యాణి డ్యామ్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడం ఇదే తొలిసారి.