కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చిన టీటీడీ ఇప్పుడు ఆర్జిత సేవలకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో భక్తులు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చు.
టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో సేవా టికెట్లు కొనుగోలు చేయ్యాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. వర్చువల్ క్యూ పద్ధతిలో ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయించనుంది. ఈ రోజు నుంచి 22న ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో నమోదు చేసుకునేలా టీటీడీ అవకాశం కల్పించింది. టికెట్లు పొందిన భక్తుల జాబితాను ఈ నెల 22న ఉదయం 10 గంటల తరువాత టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అంతేకాకుండా భక్తులకు ఎస్ఎమ్ఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ అధికారులు తెలిపారు.