కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్నిమంగళవారం(నవంబర్ 8) దాదాపు 11 గంటల పాటు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రోజు బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని పేర్కొంది. సోమవారం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని చెప్పింది.
మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం కారణంగా శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేశాక తర్వాత వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తిరుమలలో అన్నప్రసాద వితరణ ఉండదు.
కొనసాగుతున్న భక్తుల రద్ధీ..
తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84,211 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రూ.4.20 కోట్ల ఆదాయం రాగా.. శ్రీవారికి 30,906 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.