తిరుమలలో రేపు పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది.

By అంజి
Published on : 15 Jan 2024 8:45 AM IST

TIRUMALA, SRIVARI PARVETA FESTIVAL, TTD

తిరుమలలో రేపు పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 86,107 మంది భక్తులు దర్శించుకోగా.. 29,849 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో రూ.3.13 కోట్ల హుండీ ఆదాయం చేకూరింది.

Next Story