నెట్టింట తిరుమల శ్రీవారి ఆనంద నిలయ దృశ్యాలు.. భక్తుల ఆందోళన
తిరుమల ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో ఆలయ ఆవరణలోకి ప్రవేశించాడు.
By అంజి Published on 9 May 2023 3:30 AM GMTనెట్టింట తిరుమల శ్రీవారి ఆనంద నిలయ దృశ్యాలు.. భక్తుల ఆందోళన
తిరుమల ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో ఆలయ ఆవరణలోకి ప్రవేశించాడు. శ్రీవారి ఆనంద నిలయ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌లో శ్రీవారి ఆనంద నిలయ దృశ్యాలు చిత్రీకరించిన భక్తుడిని గుర్తించేందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీఫుటేజీని తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఓ భక్తుడు తిరుమల ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆనంద నిలయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో.. విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలు, ప్రధాన ఆలయం కనిపించింది. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ ఓ భక్తులు ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను పట్టుకుని ఎలా వెళ్లగలిగాడని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది టీటీడీలో భద్రతా వైఫల్యంపై పలు ప్రశ్నలకు దారితీస్తోంది. శ్రీవారి ఆలయంలోకి ఎలాంటి లగేజీని కూడా సిబ్బంది అనుమతించరు. పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీల తర్వాతనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమల ఆనంద నిలయం దృశ్యాల చిత్రీకరణ ఘటనకు విజిలెన్స్ అధికారుల వైఫల్యమే కారణమని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. బాధ్యతరహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.