తిరుమలలో బాలిక మృతి ఘటనలో ట్విస్ట్.. దాడి చేసింది చిరుత కాదా?

తిరుమల అలిపిరి మెట్లమార్గంలో శుక్రవారం రాత్రి కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక శవమై కనిపించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2023 11:34 AM IST
Tirumala, Six Years Girl, Dead, Attack wild animal,

తిరుమలలో బాలిక మృతి ఘటనలో ట్విస్ట్.. దాడి చేసింది చిరుత కాదా?

తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. అలిపిరి మెట్లమార్గంలో శుక్రవారం రాత్రి కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక శవమై కనిపించింది. అడవి జంతువుల దాడిలో ఆమె మృతి చెంది ఉండవచ్చని తిరుమల అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే.. చిన్నారిపై దాడి చేసింది ఏ జంతువు అనే దానిపై టీటీడీ అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం మధ్యాహ్నం అలిపిరి కాలినడక మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తండ్రి దినేష్, తల్లి శశికళతో పాటు వచ్చిన ఆరేళ్ల చిన్నారి రాత్రి 7 గంటల సమయంలో కనిపించకుండా పోయింది. ఆమె కిడ్నాప్‌కు గురైందని భావించిన తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పోలీసులు, భద్రతా సిబ్బంది, అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నరసింహస్వామి గుడి సమీపంలో బాలిక మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై జంతువులు దాడి చేసిన ఆనవాలు కనిపించాయి. దాంతో.. అందరూ చిరుతపులి దాడి చేసి చంపేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీ వెంకటేశ్వర రాంనారాయణ్‌ రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం రాత్రి చిన్నారి తప్పిపోయినట్లు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే అలిపిరి మెట్ల మార్గం, అటవీ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు చెప్పారు. అయితే.. తెల్లవారుజామున నరసింహస్వామి ఆలయం దగ్గర ఒక అమ్మాయి మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు ఓ యాత్రికుడు చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం కనిపించిందని పోలీసులు చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కాగా.. పాపపై ఏ జంతువు దాడి చేసిందన్న విషయం పోస్టుమార్టం తర్వాత తేలనుందని పోలీసులు వివరించారు.

కాగా.. సిసిటీవీ ఫుటేజీలో బాలిక ఒంటరిగా వారి తల్లిదండ్రుల కంటే ముందుకు వెళుతున్నట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఆమె ఒంటరిగా నడవటం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పిల్లలను ఒంటరిగా వదిలివేయవద్దని తల్లిదండ్రులకు పదేపదే సూచిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ముఖ్యంగా రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దని.. ఎవరు వెళ్లినా గుంపులుగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇక.. ఈ సంఘటనతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. టీటీడీ అధికారులే కారణమని ఆరోపిస్తున్నారు. గతంలోనూ బాలుడిపై చిరుత దాడి చేసిందనీ.. ఆ తర్వాత చిరుతను పట్టుకున్నా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదంటూ ఆరోపిస్తున్నారు. జంతువుల దాడులను నివారించేందుకు కంచెను ఎందుకు ఏర్పాటు చేయలేదని మృతురాలి కుటుంబం టీటీడీ అధికారులను ప్రశ్నించింది.

తిరుపతి సమీపంలో ఉన్న శేషాచలం అడవులు అనేక చిరుతలు, ఎలుగుబంట్లకు నిలయంగా ఉన్నాయి. తిరుమలలో జంతువుల దాడిలో మృతి చెందడం బహుశా ఇదే తొలిసారి. ఇంతకుముందు కూడా జంతువుల దాడులు జరిగినా మరణాలు లేవు. వారం రోజుల క్రితం తిరుపతిలోని అలిపిరి-తిరుమల పాదచారుల మార్గంలో జింకల పార్కు సమీపంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఎలుగుబంటి కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీశాఖ అధికారులు ఆ ఎలుగుబంటే చిన్నారిపై దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు.

జంతువుల కదలికలను ట్రాక్ చేయడానికి, అటవీ శాఖ పరిసరాల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశామన్నారు టిటిడి అధికారులు. వాటిలో కొన్ని చిరుతపులిని చూసినప్పుడు అలారం మోగించే సాంకేతికతను కలిగి ఉన్నాయని చెబుతున్నారు.

Next Story