శ్రీవారి భక్తులకు అలర్ట్.. 5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
Tirumala Pournami Garuda Seva 2023 on February 5th.తిరుమలలో ఫిబ్రవరి 5న పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నట్లు
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2023 1:05 PM ISTతిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 5న పౌర్ణమి గరుడసేవను వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు వెల్లడించింది.
శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
అదే రోజున (ఫిబ్రవరి 5న) తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించిన యెడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి.
”శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి” ప్రతి ఏటా మాఘ మాసం నందు నిర్వహించడం ఆనవాయితి. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
స్కంద పురాణాను సారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచూ, స్నానపానాదులు చేయుచూ, శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందెను.
ఎవరైన మానవులు అజ్ఞానంతో తల్లి దండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగినటువంటి దోషమును, ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం.
ఈ పర్వదినంనాడు ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.