తిరుమలలో విషాదం..చిరుత దాడిలో బాలిక మృతి

తిరుమలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ పాపపై చిరుత దాడి చేసింది. దాంతో.. చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 2:32 AM GMT
Tirumala, Leopard, Attack, Girl, Dead,

 తిరుమలలో విషాదం..చిరుత దాడిలో బాలిక మృతి

తిరుమలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో భక్తులు వెళ్తుండగా ఉన్నట్లుండి చిరుత వచ్చేసింది. ఓ పాపపై చిరుత దాడి చేసింది. దాంతో.. చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నరసింహస్వామి ఆలయం దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఓ కుటుంబం అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు బయల్దేరింది. ఈ క్రమంలో నరసింహస్వామి ఆలయం దగ్గరకు వెళ్లాక లక్షిత కనిపించలేదు. దాంతో.. కుటుంబం ఎంతో ఆందోళన చెందింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి కనిపించకుండా పోయింది చిన్నారి. అయితే.. రాత్రంతా బాలిక కోసం పోలీసులు గాలించారు. ఏమైందో అని చుట్టుపక్కల ప్రాంతమంతా వెతికారు. కాగా.. శనివారం ఉదయమే లక్షిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నరసింహస్వామి ఆలయం దగ్గర బాలిక డెడ్‌బాడీ ఉందని.. ఒంటిపై తీవ్ర గాయాలు అయ్యాయని అందుకే బాలిక చనిపోయిందని చెప్పారు. ఈ ఘటన చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దేవుడి దర్శనానికి వస్తే తమ కూతురు దేవుడి దగ్గరికే వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

బాలిక తప్పిపోయిందనే ఉద్దేశంతో వెతికామని పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో పడి ఉండటంతో చిరుతే చిన్నారిని లాక్కెళ్లి దాడి చేసి ఉంటుందని.. చిరుత దాడిలోనే ప్రాణాలు కోల్పోయిందని భావిస్తున్నారు. రాత్రే చిరుత పులి దాడిచేసిందని.. అందుకే చిన్నారి కనిపించకుండా పోయిందని అంటున్నారు మిగతా భక్తులు. అయితే.. పాప తల్లిదండ్రుల నుంచి ఎలా తప్పిపోయింది.. చిరుతకు ఎలా చిక్కింది అనేది తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా.. కొద్దిరోజుల క్రితం కూడా ఓ బాబుపై చిరుత దాడి చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతం కావడంతో భక్తులంతా ఆందోళన చెందుతున్నారు. అప్పుడు తాతతో పాటు ఉన్న బాబుని చిరుత లాక్కెళ్లింది. దాడి చేసింది. అయితే.. అదృష్టవశాత్తు ఆ బాబు చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఆ తర్వాత బోను ఏర్పాటు చేసి చిరుతను కూడా బంధించారు. చిరుతను తీసుకెళ్లి దూరంగా అటవీప్రాంతంలో వదిలేశారు. మరోసారి చిరుత దాడి సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో టీటీడీ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. నడకమార్గంలో వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులుగానే తిరగాలని సూచిస్తున్నారు.

Next Story