తిరుమలలో చిరుతల భయం.. అసలు ఎన్ని ఉన్నాయ్‌?

తిరుమలలో వరుస చిరుత దాడులు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2023 7:39 AM GMT
Tirumala, Leopard, Attack, devotees, Panic,

 తిరుమలలో చిరుతల భయం.. అసలు ఎన్ని ఉన్నాయ్‌?

తిరుమలలో వరుస చిరుత దాడులు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల తిరుమలకు నడక మార్గంలో వెళ్తున్న చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన లక్షిత ప్రాణాలు కోల్పోయింది. అంతకు ముందు కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. అప్పుడు ఆ బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొంది.. ఆ తర్వాత క్షేమంగా ఇంటికెళ్లాడు. దాడి చేసిన ప్రతిసారి ఒక చిరుతను బోనుల్లో బంధిస్తున్నారు టీటీడీ అటవీ అధికారులు. ముందు బాలుడిపై దాడి జరిగిన తర్వాత చిరుతను బంధించారు. అయినా..మరోసారి బాలికపై చిరుత దాడి చేసి చంపింది. ఈసారి కూడా చిరుతను బంధించారు. కానీ.. బాలికపై దాడి చేసింది అదే చిరుతనా? లేదంటే మరోటా? అనేది తెలియలేదు. కాగా.. చిరుత వరుస దాడులు తిరుమల భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు టీటీడీ అటవీ ప్రాంతంలో ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై చర్చ జరుగుతోంది.

తాజాగా టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. తిరుమల అలిపిరి కాలినడక పరిసర ప్రాంతాల్లో మరో ఐదు చిరుతలు ఉన్నాయని చెబుతున్నారు. తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదు అయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులు మరింత అలర్ట్‌గా ఉండాలని.. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలేయేద్దని హెచ్చరిస్తున్నారు. అంతేకాక.. భక్తుల భద్రత కోసం పలు ఆంక్షలు కూడా విధించిన విషయం తెలిసిందే. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అటవీశాఖ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు.

సోమవారం ఉదయం తిరుమల-అలిపిరి కాలినడక ఆర్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కిన విషయం తెలిసిందే. ఆ చిరుతకు బోనులో చిక్కిన క్రమంలో స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో చికిత్స కోసం చిరుతను జూపార్క్‌కు తరలించారు. చికిత్స తర్వాత ఆ చిరుత మ్యాన్‌ ఈటర్ అవునా? కాదా? అనే అంశంపై పరీక్షిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. అంతేకాక పట్టుబడ్డ చిరుతను ఎక్కడ వదలాలనే దానిపైనా నిర్ణయం తీసుకుంటారు అధికారులు.

మరోవైపు తాజాగా తిరుమల మెట్ల మార్గంలోనే ఓ ఎలుగబంటి తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయం 2వేల మెట్టు వద్ద ఎలుగుబంటి కనిపించిందని భక్తులు చెబుతున్నారు. దాంతో.. వారు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. వారు మైక్‌లో నడకమార్గంలో వస్తోన్న భక్తులను అప్రమత్తం చేశారు. అయితే.. కాసేపటికే ఎలుగుబంటి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయిందని భక్తులు అంటున్నారు. అయితే.. వరుసగా వేటాడే జంతువులు తిరుమల మెట్ల మార్గంలో కనిపిస్తుండటంతో భక్తులు ఆ దారుల్లో వెళ్లాలంటేనే ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ అధికారులు వెంటనే స్పందించి మెట్ల మార్గాలకు పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Next Story