తిరుపతి లడ్డు పంపిణీలో ఇక మార్పు.. గ్రీన్ మంత్ర బ్యాగుల్లో..
Tirumala Laddus will Distribute In Green Mantra Bags. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో నూతనంగా గ్రీన్ మంత్ర బ్యాగుల్లో.
By Medi Samrat
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో నూతనంగా గ్రీన్ మంత్ర బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఈ బ్యాగుల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని అన్నారు. 180 రోజుల్లో ఈ బ్యాగు ఎరువుగా మారుతుందని చెప్పారు.ప్రస్తుతం అందిస్తున్న కాగితం, జనపనార సంచుల ధరలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 5 లడ్డూలు పట్టే బ్యాగు ధర రూ.3, 10 లడ్డూలు పట్టేది రూ.6కు అందిస్తున్నామని అన్నారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాల్లో శ్రీవారి లడ్డూల పంపిణీ చర్చనీయాంశంగా మారింది. తిరుమల నుంచి పెద్ద ఎత్తున ట్రేలు తిరుపతికి రావడం.. వాటిలోని లడ్డూలను కవర్లలోకి పెట్టి పంచడంపై విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ బలపరచిన కొందరు అభ్యర్థులు.. ఓటర్లకు నగదు, వస్తువులతోపాటు కొన్నిచోట్ల శ్రీవారి లడ్డూలను పంచారంటూ వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రేషన్ బియ్యం సరఫరా వాహనాలను కూడా వాడారని ఆరోపణలు వచ్చాయి. తిరుమల పోటులో లడ్డూలు తయారు చేసి ట్రేలలో పెట్టి విక్రయకేంద్రాలకు తరలిస్తారు.
ఆయా నగరాలకు మాత్రమే టిటిడి ప్రత్యేక వాహనంలో లడ్డూ ట్రేలను తరలించే వారు. అంతకుమించి టిటిడి అధికారులు.. వ్యక్తిగత అవసరాలకు ట్రేలలో లడ్డూలను పంపిన దాఖలాల్లేవు. అందుకు భిన్నంగా ట్రేలలో లడ్డూలను తిరుమల నుంచి కిందికి పంపినట్లు.. వాటిని కవర్లలో పెట్టి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతికి లడ్డూల ట్రేలు ఎలా వచ్చాయనే దానిపై టిటిడి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినట్లు, విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.