వర్షాభావ పరిస్థితులు.. ఎండిపోతున్న తిరుమల డ్యామ్‌లు.. నీటి సంరక్షణకు టీటీడీ విజ్ఞప్తి
తిరుపతి: వర్షాభావ పరిస్థితుల కారణంగా తిరుమలలో డ్యామ్‌లు ఎండిపోతున్నాయి.
By అంజి Published on 22 Aug 2024 2:55 AM GMTవర్షాభావ పరిస్థితులు.. ఎండిపోతున్న తిరుమల డ్యామ్‌లు.. నీటి సంరక్షణకు టీటీడీ విజ్ఞప్తి
తిరుపతి: వర్షాభావ పరిస్థితుల కారణంగా తిరుమలలో డ్యామ్‌లు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో 130 రోజులకు సరిపడా మాత్రమే నీరు నిల్వ ఉంటుందని అధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. సంక్షోభం నుండి మేల్కొలపడానికి.. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కొండపై నీరు వృథా కాకుండా చూడాలని భక్తులు, స్థానికులను అభ్యర్థించింది. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో అందుబాటులో ఉన్న నీటిని స్థానికులు, హిల్ టౌన్‌లోని యాత్రికుల అవసరాలను తీర్చడానికి వినియోగించబడుతున్నాయి. అయితే రాబోయే 120-130 రోజుల వరకు సరిపడా నీరు మాత్రమే ప్రస్తుతం ఉందని టిటిడి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నీటి వృథాను నివారించాలని భక్తులతో పాటు స్థానికులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య (అక్టోబర్ 4వ తేదీ మినహా) వాహన సేవలు ఉంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు.
రాబోయే కొద్ది నెలల పాటు ఇదే అసాధారణ పరిస్థితి కొనసాగితే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలను పరిశీలిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారని, అందులో 18 ఎల్‌జి తిరుమల డ్యామ్‌ల నుండి, మిగిలినవి తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 5800 లక్షల గ్యాలన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.