తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో చిన్నశేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పై నుంచి భక్తులకు అభయ ప్రధానం చేశారు. భక్తులు దారిపొడవునా బారులు తీరి హారతులతో స్వాగతం పలుకుతూ దేవదేవుడిని కనులారా దర్శించుకున్నారు. వాహనం ముందు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు. రాత్రి 7 గంటల తరువాత హంస వాహన సేవ నిర్వహించనున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్
తిరుమల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ బుధవారం మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంగళవారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. బుధవారం ఉదయం మళ్లీ దర్శనం చేసుకున్నారు. అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి పరకామణి భవన సముదాయాన్ని జగన్ ప్రారంభించారు.