శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. ఈ ఆలయాలు కూడా మూసివేత!!
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Medi Samrat
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు దాదాపు 15 గంటల పాటు స్వామివారి దర్శన భాగ్యం ఉండదని తెలిపింది. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 గంటల నుంచి, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు ఆలయం మూసివేత కొనసాగుతుంది. ఆలయం మూసివేత సందర్భంగా అన్ని రకాల ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలపై జారీచేసే దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత, సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, దర్శనాలను యథావిధిగా పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
పలు అనుబంధ ఆలయాలు మూసివేత:
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం…
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని 07వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 02.15 గం.ల నుండి మూసివేస్తారు. 08వ తేదీ సోమవారం ఉదయం 04.00 గం.లకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యవచనం చేస్తారు. ఉదయం 08.00 గం.ల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం..
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో 07వ తేదీ మద్యాహ్నం 01.30 గం.ల నుండి 03.00 గం.ల వరకు శుద్ధి, పూలంగి సేవ, శాత్తుమొర తదితర సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం మద్యాహ్నం 03.30 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు. 08వ తేదీ సోమవారం ఉదయం 04.30 గం.ల నుండి పలు సేవలు అనంతరం ఉదయం 09.30 గం.లకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 07వ తేదీ మధ్యాహ్నం 01.30 గం.ల నుండి 03.00 గం.ల వరకు కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించి 03.30 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు. 08వ తేదీ సోమవారం ఉదయం 04.45 గం.లకు తెరుస్తారు. తదుపరి ఏకాంత సేవల తర్వాత ఉదయం 08.30 గం.లకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
కపిలతీర్థం ఆలయం
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మద్యాహ్నం 01.30 గం.ల నుండి సోమవారం ఉదయం 03.00 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయశుద్ధి, సుప్రభాతం, అభిషేకం, అర్చన సేవల తదుపరి ఉదయం 07.00 గం.ల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
అమరావతిలోని ఎస్వీ ఆలయం, నారాయణవనం, కార్వేటినగరం, కడప, ఒంటిమిట్ట తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం 01.50 గం.లకు మూసి వేసి, 08వ తేదీ సోమవారం ఉదయం 03.00 గం.లకు తెరుస్తారు.