తిరుమలలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపింది. కేసులు తగ్గుముఖం పట్టినట్టుగానేపట్టి మళ్లీ విజృంబిస్తుంది. తాజాగా తిరుమలలోని వేద పాఠశాల విద్యార్థులు 57 మందికి కరోనా సోకింది. పాఠశాల గత నెల ప్రారంభమవగా.. 450 మందికి కరోనా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఏకంగా 57 మందికి కరోనా సోకింది. దీంతో ఆ విద్యార్థులను తిరుపతిలోని స్విమ్స్‌కి తరలించారు. విద్యార్ధులు అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే.. వీరిలో కొంతమందికి ఇప్పుడు కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. అయినా.. ముందస్తు జాగ్రత్తగా వారిని క్వారంటైన్‌లో ఉంచారు.
ఇదిలావుంటే.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,079 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 118 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇక 24 గంటల్లో 89 మంది మహమ్మారి నుండి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 1038 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.