కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర తరువాత భక్తులకు ఆఫ్‌లైన్ టోకన్ల ను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
నేటి నుంచి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస వసతి సముదాయాలు, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం టోకన్లను ఇస్తున్నారు. రోజుకు 15 వేల టోకెన్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పారు. తెల్లవారుజామున నుంచే టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. ప్రారంభంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం కౌంటర్ల వద్ద సాధారణ స్థితి కనిపిస్తోంది.