Salakatla Vasantotsavam : భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ 3 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. పలు సేవలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుంచి 5 వరకు సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 6:56 AM GMTప్రతీకాత్మక చిత్రం
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఏ రోజున ఏం చేస్తారంటే..?
ఏప్రిల్ 3 సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తి అయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ఏప్రిల్ 4 మంగళవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి వారు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఏప్రిల్ 5 బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది.
పలు సేవలు రద్దు..
వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 4న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది.