శ్రీవారి భక్తులకు శుభవార్త
Special Darshan tickets will be released on August 18th.శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)
By తోట వంశీ కుమార్
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం(ఆగస్టు 18న) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నట్లు చెప్పింది.
బ్రహోత్సవాలు జరిగే రోజులు మినహా మిగిలిన రోజులకు టికెట్లు ఇవ్వనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు సర్వదర్శనం మినహా మిగిలిన అన్ని దర్శనాలు రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామి వారిని దర్శించుకోవాలని సూచించింది.
భక్తుల రద్దీ సాధారణం..
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం స్వామి వారిని 72,851 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 34,404 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో నిలబడి ఉన్న వారికి తాగునీరు, చిన్నపిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేశారు.