రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
Record Income for Tirumala Temple.జనవరి 2 సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2023 11:22 AM ISTజనవరి 2 సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉత్తరద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఒక్క రోజే రూ.7.68 కోట్ల కానుకులు భక్తులు సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. కాగా.. నిన్నటి వరకు 23 అక్టోబర్ 2022 వచ్చిన రూ.6.31 కోట్ల అత్యధికంగా ఉంది.
ఇక సోమవారం 69 వేల 414 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. 18,612మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించడంతో అప్పటి వరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. వైకుంఠ ద్వార దర్శనం ఉన్న పది రోజులు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేశారు. శ్రీవాణి, ఎస్ఈడీ టిక్కెట్లు, ఎస్ఎస్డీ టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు మహా లఘు దర్శనం కల్పిస్తున్నారు.
ఈ నెల 28న శ్రీవారి రథసప్తమి వేడుక వైభవంగా జరగనుంది. ఒకే రోజున శ్రీవారు సప్తవాహనాలపై ఊరేగనున్నారు.