18న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం
మార్చి 18న న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 8:45 AM GMTపుష్పయాగం ప్రతీకాత్మక చిత్రం
తిరుపతి : ఈ నెల 18న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇందుకోసం మార్చి 17న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో ఫిబ్రవరి 11 నుంచి 19 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
మార్చి 18న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 18న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
సర్వదర్శనానికి 24 గంటలు..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 79,561 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.82 కోట్లు వచ్చింది.