తిరుపతి : తిరుపతిలో జూలై 7 నుంచి 31 వరకు పోలీసు చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
'బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా సమావేశాలు నిర్వహించుకునేందుకు సంబంధిత పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలి. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు. బాడీ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘా చేపడుతారు' అని ఎస్పీ అన్నారు.
ఇక ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, గుంపులుగా గుమిగూడడం, డప్పులు వాయించడం, పెద్ద శబ్దాలు చేయడం, క్రాకర్లు పేల్చడం నిషేధించబడిందని తెలిపారు.
రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని పరమేశ్వర రెడ్డి కోరారు.