తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు 1.02 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. మంగళవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి చెక్కును అందించారు. ఈ మొత్తంలో రూ.15 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, రూ.87 లక్షలు శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లోని వంటగదిలో కొత్త ఫర్నీచర్, పాత్రలకు ఉపయోగించాలని ముస్లిం దంపతులు ఈవోను కోరారు. చెక్కు అందించిన అనంతరం టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు అబ్దుల్ ఘనీ, కుటుంబ సభ్యులకు ప్రసాదాలు అందజేశారు.
కాగా, సోమవారం దాదాపు 67,276 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ హుండీకి రూ.5.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ టీటీడీ రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు. కాబోయే కోడలు రాధికతో కలసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు తమకు తోచినంత విరాళం అందిస్తుంటారు. హుండీకి సైతం గత రెండు నెలలుగా భారీగా ఆదాయం వస్తోంది.