Tirumala: భక్తుల బస కోసం.. మొబైల్ కంటైనర్లు ప్రారంభం

భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

By అంజి  Published on  27 July 2023 2:30 PM GMT
Mobile containers, devotees, Tirumala, YV Subbareddy

Tirumala: భక్తుల బస కోసం.. మొబైల్ కంటైనర్లు ప్రారంభం

భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా మొబైల్ కంటెనర్లను ప్రారంభించింది. వీటిని విశాఖపట్నంకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేశారు. గురువారం నాడు రెండు మొబైల్ కంటైనర్లను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక కంటైనర్‌ను జీఎన్సీ దగ్గర టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు. మరో కంటైనర్ ను రాంభగీచా -3 ఎదురుగా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉందని తెలిపారు. నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని, ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలో మొబైల్ కంటైనర్లను దాత అందించారని, ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, వాష్‌రూమ్స్‌ ఉన్నాయని చెప్పారు. ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కంటైనర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మరిన్ని కంటైనర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

అటు తిరుమలలో అన్నమయ్య భవనం ఎదురుగా నిర్మించిన కావేరి విశ్రాంతి గృహాన్ని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఏవి.ధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ స్థానిక సలహా మండలి అధ్యక్షులు భాస్కర్ రావు విరాళంతో ఈ విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవోను దాత ఘనంగా సత్కరించారు. ఇదిలా ఉంటే.. తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు.

Next Story