తిరుమలలో భారీ వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు
Heavy Rain in Tirumala.. తిరుమలలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా
By సుభాష్ Published on 16 Nov 2020 6:02 AM GMTతిరుమలలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో తిరుమల భక్తులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వైకుంఠ కంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. ఈ అకాల వర్షం కారణంగా తిరుమలలో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం వల్ల ఏడుకొండలు తడిసి ముద్దవుతున్నాయి. మొదటి, రెండో ఘాట్ రోడ్డులలో పలు చోట్ల కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి.
ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
ఆదివారం రాత్రి మొదటి ఘాట్ రోడ్డు 54వ మలుపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విరిగిపడ్డ కొండరాళ్లను తొలగించారు. రాత్రి సమయం వాహనాలకు అనుమతి లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. కానీ భారీ వర్షం కారణంగా ఘాట్ రోడ్డులో వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి.