భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పిన టీటీడీ

Good news to Devotees Srivari Mettu Margam to be opened from May 1st.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2022 1:43 PM IST
భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పిన టీటీడీ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి భ‌క్తులు వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పింది. మే 1 నుంచి శ్రీవారి మెట్టు న‌డ‌క మార్గాన్ని భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గ‌తేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంస‌మైన సంగ‌తి తెలిసిందే.

వ‌రద ప్ర‌భావంతో శ్రీవారి మెట్టు మార్గం పై పెద్ద పెద్ద బండ‌రాళ్లు, మ‌ట్టిపెళ్ల‌లు ప‌డి అక్క‌డ‌క్క‌డ గుంట‌లు ఏర్ప‌డి న‌డ‌వ‌డానికి వీలులేని విధంగా మారిపోయింది. అప్ర‌మ‌త్త‌మైన టీటీడీ వెంట‌నే మెట్టుమార్గాన్ని మూసివేసింది. వ‌ర‌ద‌లు త‌గ్గిన అనంత‌రం మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో దాదాపు ఐదు నెలల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మళ్లీ తెరుచుకోనుంది.

టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులను పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. మే 1 నుంచి భ‌క్తుల‌ను ఈ మార్గంలో అనుమ‌తించ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం భ‌క్తులు అలిపిరి మార్గంలోనే శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వెలుతున్నారు. మే 1 నుంచి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రానుండ‌డంతో ఇరు మార్గాల ద్వారా భ‌క్తులు కొండ‌పైకి చేరుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇదిలా ఉంటే.. కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. రెండేళ్ల తర్వాత తిరుమలలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. నిన్న శ్రీవారిని 68,299 మంది భక్తులు దర్శించుకోగా 26,421 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.4.90 కోట్లు ఆదాయం వ‌చ్చింది.

Next Story