కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో.. దేశ వ్యాప్తంగా ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా క్రమ క్రమంగా ఆలయాలు తెరచుకున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటున్నారు. ఇక కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి కరోనా రాకముందు నిత్యం భక్తులతో రద్దీగా ఉండేది. అయితే.. కరోనా అనంతరం భక్తుల రద్దీ అంతగా ఉండడం లేదు.
రోజు వారి టోకెన్ ప్రకారమే శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్‌లను పదివేల నుంచి 20వేలకు పెంచింది. ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు భూదేవి కాంప్లెక్స్‌లో ఈ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. టికెట్లను పొందేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్ ధరించి రావాలని, చేతులను శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.