ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రజాప్రతినిధులు దారి తప్పి ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా తిరుమల కొండపై ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రవర్తించిన తీరుపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన మంత్రి ఉషశ్రీ... 50 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే మరో 10 మంది అనుచరులు సుప్రభాతం టికెట్లు పొందారు. ఇప్పటికే తిరుమలలో భక్తలు రద్దీ భారీగా ఉంది.. అయినా మంత్రి ఉషశ్రీ ఒత్తిడికి తలొగ్గి టీటీడీ స్పెషల్ టికెట్లను జారీ చేసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండటంతో.. టీటీడీ ముందు జాగ్రత్తగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. దివ్యాంగులు, పిల్లలు, వృద్ధుల దర్శనాలతో పాటు వీఐపీ దర్శనాలను, సిఫార్సు లేఖలపై దర్శనాలు సైతం రద్దు చేసిన టీటీడీ.. మంత్రి ఉషశ్రీకి దర్శనం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై ఆమె గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించడం సంచలనం కలిగించింది. ఈ క్రమంలో ఓ వీడియో జర్నలిస్టును మంత్రి సిబ్బంది తోసేశారు.
భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ప్రతి రోజు దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు గత ఐదు రోజులుగా వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 92 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో.. తిరుమలకు వచ్చే భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకోని బయల్దేరాలని టీటీడీ సూచించింది.