వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 22 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. టిటిడి జేఈఓ వీరబ్రహ్మం గురువారం ఆలయాన్ని సందర్శించి వార్షిక బ్రహ్మోత్సవాల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వార్షిక బ్రహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 22 నుంచి 30 వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 21న బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ జరగనుందన్నారు. ప్రధానంగా జనవరి 26న గరుడవాహనం, 28న రథోత్సవం జరుగుతాయని చెప్పారు. జనవరి 31న పుష్పయాగం ఉంటుందని వివరించారు. ఇప్పటికే టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు రథం పటిష్టతను పరిశీలించారన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారి వాహన సేవలను దర్శించాలని కోరారు.
అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
రూ. 50లక్షల నిధులతో అన్నమయ్య జిల్లాలోని తాళ్లపాక 108అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద చేపట్టిన శ్రీవారి నూతన ఆలయ నిర్మాణ పనులను జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. రూ. 45లక్షలతో చేపడుతున్న అన్నమయ్య విగ్రహం వద్ద నూతన వేదిక, రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీసౌమ్యనాథ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పనులు, ఎలక్ట్రికల్, సివిల్ పనులు, భక్తులకు తాగునీటి సౌకర్యం, పుష్కరిణి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.