శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. ముగ్గురికి గాయాలు
Devotees heavy rush for Sarva Darshan tickets in Tirupati.కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఆంక్షలు దాదాపుగా
By తోట వంశీ కుమార్ Published on 12 April 2022 11:32 AM ISTకరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఆంక్షలు దాదాపుగా ఎత్తివేయడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల(గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్) వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో నేడు మళ్లీ సర్వదర్శనం టికెన్ల కౌంటర్ తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ముగ్గురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన భక్తులను రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. ఇక టికెట్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చామని, ఇప్పటికే ఇక్కడకు వచ్చి మూడు, నాలుగు రోజులు అవుతుందని, టోకెన్లు మాత్రం ఇవ్వటం లేదని భక్తులు అంటున్నారు.
భోజనం, మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోయినా.. కనీసం కొండపైకి అనుమతించడం లేదని మండిపడుతున్నారు. కొండపైకి అనుమతిస్తే.. కనీసం తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని వాపోతున్నారు.
సోమవారం తిరుమల శ్రీవారిని 63,223 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 34,547 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.