తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల సంఖ్య.. పలు ఆలయాల మూసివేత..!
Devotees floating has reduced in tirumala.దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తిరిగి కోరలు చాస్తున్న క్రమంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ రోజురోజుకు తగ్గుతోంది.
By తోట వంశీ కుమార్
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తిరిగి కోరలు చాస్తున్న క్రమంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ రోజురోజుకు తగ్గుతోంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ తగ్గించింది. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తిరుపతిలోని విష్ణువివాసంలో, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే సర్వదర్శన టోకెన్ల జారీని రద్దు చేయడంతో శ్రీవారిని దర్శించుకునే సంఖ్య 50 వేల నుంచి 25వేలకు పడిపోయింది. తిరుమల క్షేత్రంలో భక్తుల సందడి తగ్గింది. శ్రీవారి ఆలయంలో తప్ప మిగిలిన ప్రదేశాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
పలు ఆలయాలు మూసివేత
దేశవ్యాప్తంగా పలు ప్రముఖ ఆలయాలు కూడా కరోనా కారణంగా మూతబడ్డాయి. భక్తుల సందర్శనకు వీలు లేదని ఇప్పటికే ఆలయ అధికారులు తేల్చి చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రాలను మరో 15 రోజులు మూసివేసేలా ప్రభుత్వం ఆదేశించింది. ఆలయాలలో దైనందిన పూజా కార్యక్రమాలు సాగుతాయి. కానీ భక్తులకు బుధవారం నుంచి దర్శనానికి అనుమతులు లేవు. మైసూరు చాముండేశ్వరి ఆలయంతోపాటు బెంగళూరులోని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. దక్షిణకన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో సర్పసంస్కార సేవలను నిలిపివేశారు.
ధర్మస్థళ మంజునాథస్వామి, మంగళూరులోని కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయాలతోపాటు చిక్కమగళూరు జిల్లాలోని హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేశారు. శృంగేరి శారదాంబ ఆలయంలోనూ భక్తుల దర్శనం రద్దయింది. పుత్తూరు తాలూకా కోడంబాడి మఠంతబెట్ట మహిషాసురమర్ధిని ఆలయంలో బ్రహ్మకళశ ఉత్సవాలను వాయిదావేశారు. చామరాజనగర్ జిల్లాలోని మలెమహదేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం రద్దు చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల విషయంలో కూడా అధికారులు ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గిన తర్వాత సామాన్య ప్రజలను దర్శనం కోసం అనుమతివ్వనున్నారు