తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం, వారికి ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా విరాళాల సాయంతో తిరుమలలోని పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పార్కును రూ.64 లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ పార్కు నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. తిరుమలలో మరో నాలుగు పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చైర్మన్ తెలిపారు.
ఈ నెల 28న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన నూతన పరకామణి మండపం, అతిథి గృహాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఘాట్ రోడ్డులో కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తి చేసి జనవరి నుంచి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, తిరుమలలోని అన్నప్రసాద సముదాయం ఎదురుగా ఉన్న నూతన పరకామణి భవనాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్‌వో నరసింహకిషోర్‌తో కలిసి పరిశీలించారు.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించి పక్కాగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రెండున్నరేళ్ల తరువాత భక్తుల మధ్యన స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందువల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు.