మరికొంతకాలం వేచిచూడక తప్పదు

By -  Nellutla Kavitha |  Published on  31 March 2022 3:54 PM IST
మరికొంతకాలం వేచిచూడక తప్పదు

కరోనా మహమ్మారి కారణంగా వృద్ధులు, దివ్యాంగులు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శన సదుపాయాలతో పాటు ఆర్జిత సేవలను 2020 మార్చి 20వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో, కరోనా నిబంధనలను పాటిస్తూనే స్వామివారి దర్శనం, ఆర్జిత సేవలను పూర్తి స్థాయిలో రేపటి నుంచి ప్రవేశపెడ్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగులకు దర్శనాలను పునరుద్ధరిస్తూ ఉన్నట్టుగా టీటీడీ ప్రకటించింది. ప్రతిరోజు 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారిని దర్శించుకోవడానికి వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాల కోసం స్పెషల్ టికెట్లను జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. కానీ సాఫ్ట్వేర్లో సమస్య తలెత్తడంతో ఈ టోకెన్ల జారీని ఏప్రిల్ 8 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

ప్రతి రోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం కాకుండా వారంలో అన్ని రోజులూ ఉదయం 10 గంటలకు, శుక్రవారం రోజు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్టుగా టిటిడి ప్రకటించింది. దీంతోపాటుగానే ఈరోజు జారీ చేయాల్సిఉన్న అంగప్రదక్షిణ టోకెన్లను కూడా పరిపాలనా కారణాలతో వాయిదా వేసినట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ టోకెన్లను ఉగాదినాడు అంటే, ఏప్రిల్ 2 వతేదీ నుంచి ఇస్తున్నామని టిటిడి అధికారులు చెప్పారు.

Next Story