తిరుపతి : వేసవి సెలవులు, ఇంటర్మీడియట్, ఎస్‌ఎస్‌సీ ఫలితాల దృష్ట్యా తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేకుండా క్యూలో నిలబడిన భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. తిరుమల ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమలలో జరుగుతున్న విశేష మార్పులను ప్రస్తావిస్తూ భక్తులు ఈ మార్పులను గమనించాలని కోరారు. టీటీడీ పేరుతో ఫేక్ వెబ్‌సైట్లపై ఆయన మాట్లాడారు. టీటీడీ ఐటీ విభాగం 52 నకిలీ వెబ్‌సైట్లు, 13 నకిలీ మొబైల్ యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భవిష్యత్తులో ఎవరైనా భక్తులకు ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లు కనిపిస్తే 155257కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.