తిరుమ‌ల శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికేట్‌ తప్పనిసరి

Covid-19 negative certificate is mandatory to visit Tirumala.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2021 5:01 AM GMT
తిరుమ‌ల శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికేట్‌ తప్పనిసరి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం రేప‌టి నుంచి(సెప్టెంబ‌ర్ 25) ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్ల‌ను విడుద‌ల చేస్తామ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వ‌ర‌కు రోజుకు 8వేల టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఉద‌యం 9 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు.

ఇక సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తరువాత‌ సెప్టెంబరు 26 నుంచి తిరుపతి లో శ్రీనివాసం వసతి గృహంలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేస్తామన్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉండటంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story