తిరుమలలో భారీగా రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
వేసవి సెలవులు ముగియడానికి సమయం దగ్గర పడుతుంటంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
By అంజి Published on 9 Jun 2023 3:30 AM GMTతిరుమలలో భారీగా రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
వేసవి సెలవులు ముగియడానికి సమయం దగ్గర పడుతుంటంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురిసే వరకు భక్తలు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం సర్వ దర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంపెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఆళ్వార్ ట్యాంక్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనం 24 గంటలు పడుతోందని టీటీడీ తెలిపింది.
టోకెన్లు లేకున్నా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల కొండపైకి వస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం శ్రీవారిని 75,229 మంది భక్తులు దర్శించుకున్నారు. 3.24 కోట్ల రూపాయల హూండీ కానుకల వచ్చాయి. భక్తులు రద్దీతో గదుల కొరత ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే.. తిరుమల గగనతలంలో మళ్లీ విమానాలు సంచరించాయి. గురువారం ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు మూడు విమానాలు శ్రీవారి ఆలయ గగనతలం నుంచి వెళ్లాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు దృష్టిసారించారు. ఆగమశాస్త్రాల ప్రకారం, తిరుమల ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం నిషిద్ధం.